భారతీయ విద్యా, పరిశోధనా రంగాలకు మరో గర్వకారణమైన గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్, విద్య, సాంకేతికత, కృత్రిమ మేధస్సు రంగాల్లో…

తెలుగు వ్యాకరణానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు పరవస్తు చిన్నయ సూరి: టి.డి. జనార్దన్
వెయ్యి మాటల కంటే ఒక మంచి గ్రంథం తరతరాలకు వెలుగు పంచుతుందనే భావనను మరోసారి గుర్తుచేసేలా ‘పరవస్తు చిన్నయ సూరి వైదుష్యం’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు భాషకు క్రమబద్ధమైన వ్యాకరణాన్ని అందించి, తన రచనల ద్వారా విలువలు, జీవన సత్యాలను ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు పరవస్తు చిన్నయ సూరి సేవలను ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్దన్ మాట్లాడుతూ చిన్నయ సూరి రచనలు కేవలం సాహిత్య సంపద మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతి, భాషా వారసత్వాన్ని భావితరాలకు అందించే అమూల్య ధరోహరగా నిలిచాయని పేర్కొన్నారు. యువతలో మాతృభాషపై మమకారం పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. గ్రంథావిష్కరణ చేసిన కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష మాట్లాడుతూ ‘నీతిచంద్రిక’ వంటి రచనల ద్వారా చిన్నయ సూరి తెలుగు సమాజంతో శాశ్వత బంధాన్ని ఏర్పరుచుకున్నారని అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. త్రివిక్రమరావు తెలుగు పాలనాభాషగా, బోధనాభాషగా సంపూర్ణ స్థాయిలో అమలు కావాలనే దిశగా జరుగుతున్న కృషిని వివరించారు. చిన్నయ సూరి పాండిత్యాన్ని నేటి తరానికి చేరువ చేసే ప్రయత్నంగా ఈ గ్రంథం వెలువడటం అభినందనీయమని అన్నారు. సాహితీవేత్త డా. కప్పగంతు రామకృష్ణ సంపాదకత్వంలో రూపొందిన ఈ గ్రంథం తెలుగు భాషా వికాస చరిత్రలో మరో విలువైన అధ్యాయంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
