Skip to content

సెక్స్ ట్రాఫికింగ్ బాధితులకు కొత్త రక్షణ.. సునీతా కృష్ణన్ వివరణ

మహిళల అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం వంటి సామాజిక సమస్యలపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ తాజాగా ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్’ ప్రాధాన్యాన్ని మీడియా సమావేశంలో వివరించారు. గత 22 ఏళ్లుగా బాధిత మహిళల హక్కుల కోసం నిరంతరంగా సాగిన న్యాయపోరాటానికి ఇటీవల చారిత్రాత్మక విజయంగా కోర్టు తీర్పు వచ్చిందని ఆమె తెలిపారు. ప్రజ్వల సంస్థ ఇప్పటివరకు 32,400 మందికి పైగా మహిళలు, బాలికలను అక్రమ రవాణా, వ్యభిచార కూపాల నుంచి రక్షించినప్పటికీ, పునరావాస వ్యవస్థలోని లోపాలు, సామాజిక వివక్ష కారణంగా చాలామంది తిరిగి అదే చీకటి జీవితంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా బాధితులకు గౌరవప్రదమైన జీవితం, పునరావాసం మరియు న్యాయ సహాయం కల్పించడం ప్రాథమిక హక్కుగా గుర్తించబడుతుందని సునీతా కృష్ణన్ వివరించారు. బాధితురాలి సమ్మతి లేకుండా ఎలాంటి పునరావాస ప్రక్రియ జరగకూడదని, ప్రతి దశలో ఆమె అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ప్రణాళిక స్పష్టం చేస్తోందన్నారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసి, రెస్క్యూ నుంచి రీహాబిలిటేషన్ వరకు పూర్తి బాధ్యత, పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇందులో సూచించబడిందన్నారు. బాధితురాలికి న్యాయపరమైన ప్రాతినిధ్యం, నష్టపరిహారం వంటి హక్కులు కూడా ఈ తీర్పులో కీలక అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.

అక్రమ రవాణాపై సమగ్ర చట్టం అవసరమని కోర్టు చేసిన సూచనలను ప్రస్తావించిన సునీతా కృష్ణన్, టెక్నాలజీ ద్వారా పెరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే స్వచ్ఛందంగా వ్యభిచారంలో ఉన్నవారికి, బలవంతంగా నెట్టివేయబడిన బాధితులకు మధ్య స్పష్టమైన నిర్వచనం ఉండాలని, రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనే ప్రతి మహిళను ముందుగా బాధితురాలిగానే చూడాలని, నేరస్తురాలిగా ముద్ర వేయకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సెక్స్ ట్రాఫికింగ్ బాధితుల హక్కుల పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top