Skip to content

సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్.. ‘ధర్మస్థల నియోజకవర్గం’పై వి.వి. వినాయక్ ప్రశంసలు

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కస్తూరి, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. లిరిక్ రైటర్ చంద్రబోస్ తనకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పారని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. కథ నచ్చడంతో చంద్రబోస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పాటలు రాశారని చెప్పారని, ఆయన మాటలు విన్న తర్వాత సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ దర్శకుడు, నిర్మాత, హీరోకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ మాట్లాడుతూ ఈ సినిమా తనకు లిరిక్ రైటర్‌గా ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ‘రంగస్థలం’ తర్వాత అంత సంతోషంగా పాటలు రాసిన చిత్రం ఇదేనని తెలిపారు. సినిమాలోని ఐదు పాటలు ఎంతో అర్థవంతంగా ఉంటాయని, మహవీర్ ఏలేందర్ వాటికి అద్భుతమైన సంగీతాన్ని అందించారని చెప్పారు. ప్రతి మనిషిలో ఉండే మంచి, చెడు మధ్య జరిగే సంఘర్షణను దర్శకుడు జై జ్ఞాన ప్రభ ఆసక్తికరంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ కొత్త దర్శకులు కథను బాగా చెప్పినా తెరకెక్కించే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, అయితే జై జ్ఞాన ప్రభ మాత్రం కథను ఎంత బాగా చెప్పారో అంతే బాగా తెరపైకి తీసుకొచ్చారని ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత తప్పక చూడాల్సిన చిత్రమిదని అన్నారు. నటి కస్తూరి తనకు ఇంతవరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. సమాజానికి మంచి సందేశాన్ని అందించే చిత్రాన్ని తొలి ప్రయత్నంగా ఎంచుకున్న దర్శకుడిని అభినందించారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ ప్యాషన్ ఉన్న నిర్మాత, మంచి దర్శకుడు దొరకడం హీరో నటరాజ్ అదృష్టమన్నారు. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ తన కుమారుడు నటరాజ్ ఇలాంటి మంచి చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. సినిమాలో సందేశంతో పాటు వినోదం కూడా ఉంటుందని చెప్పారు. సాయికుమార్ తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, ఫన్‌తో పాటు యువతకు చెప్పాల్సిన మంచి సందేశం సినిమాలో ఉందన్నారు.

సంగీత దర్శకుడు మహవీర్ ఏలేందర్ మాట్లాడుతూ కథలోని ప్రతి సందర్భానికి అనుగుణంగా పాటలు ఉండేలా సంగీతాన్ని రూపొందించామని తెలిపారు. చంద్రబోస్ అందించిన అద్భుతమైన సాహిత్యానికి మంచి ట్యూన్స్ అందించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత తాను నటించిన సినిమా ఇదేనని, నిజంగా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఫిక్షనల్ కథతో సమాజానికి మంచి సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. దర్శకుడు, నిర్మాత సినిమాకు వెన్నెముకలా నిలిచారని, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఇది దర్శకుడి తొలి సినిమా అని భావించరని అన్నారు.

నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ ‘ధర్మస్థల నియోజకవర్గం’ సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తాను అనుకున్న విధంగా, ఒక్క వర్కింగ్ డే కూడా పెరగకుండా సినిమాను పూర్తి చేశారని ప్రశంసించారు. మేనేజర్‌గా ఎన్నో పెద్ద సినిమాలకు పనిచేసిన తనకు, నిర్మాతగా తొలి ప్రయత్నంలో ఇలాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం సంతోషంగా ఉందన్నారు.

దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ కథ విన్నప్పటి నుంచి సినిమా పూర్తయ్యే వరకు పూర్తి సహకారం అందించిన నిర్మాత మేరుం భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలిచారని చెప్పారు. యదార్థ ఘటన నేపథ్యాన్ని తీసుకుని ఫిక్షనల్ కథతో మంచి సందేశం, ఎంటర్‌టైన్‌మెంట్, సంగీతం కలగలిపి సినిమాను రూపొందించామని తెలిపారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.

హీరో నటరాజ్ మాట్లాడుతూ ‘ధర్మస్థల నియోజకవర్గం’ లాంటి మంచి చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ, నిర్మాత భాస్కర్ తనకు ఫిల్లర్స్‌లా నిలిచారని చెప్పారు. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం, మహవీర్ పవర్‌ఫుల్ మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఒక సాధారణ మనిషి కోసం, సాధారణ మనిషి కథతో రూపొందిన చిత్రమిదని పేర్కొన్నారు.

ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రబృందం మాటలను బట్టి ‘ధర్మస్థల నియోజకవర్గం’పై అంచనాలు మరింత పెరిగాయి. డ్రగ్స్ వంటి సమకాలీన అంశాన్ని రాజకీయ నేపథ్యంతో ముడిపెట్టి సందేశంతో పాటు వినోదాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Back To Top