గరికపాటికి వార్నింగ్ ఇచ్చిన కింగ్ బుద్ధ డైరెక్టర్ సత్యారెడ్డి
ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో “కింగ్ బుద్ధ” హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. గతంలో గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటికి ఆయన కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
“ఇకనుంచి ఎవరైనా గౌతమ బుద్ధుని గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తాం” అని సత్యారెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“గౌతమ బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన ‘శాక్య సింహం’. ఆయన జీవితం పిట్ట కథలు, చేపల కథలు కాదు, అది ఒక మహా వీరగాథ, శాంతి సందేశం. భావితరాలకు బుద్ధుని నిజమైన చరిత్ర, తత్వం. ఆయన చూపిన మార్గం తెలియజేయడం మన బాధ్యత,” అని అన్నారు.
అంతేకాక బుద్ధుని జీవితంలో ఒక విశేష ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. “బుద్ధుడిగా మారిన తర్వాత కపిలవస్తు రాజ్యంలో అడుగు పెట్టిన రోజు, ఆయన భార్య యశోదర పట్టణాన్ని దీపాలతో అలంకరించి అపూర్వ స్వాగతం పలికింది. ఆ మహత్తర సందర్భమే తర్వాత ‘బుద్ధ దీపావళి’గా మారింది” అని సత్యారెడ్డి గారు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తున్న దాదాపు 25 దేశాలు శాంతి, అభివృద్ధి, సమానత్వంలో ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “ఆ దేశాల పురోగతిని చూసి భారతదేశం కూడా మరోసారి బుద్ధిజం వైపు పయనించాలి. అదే నిజమైన శాంతి, అభివృద్ధి దారి” అని సత్యారెడ్డి గారు అభిప్రాయపడ్డారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మద్దతుదారులు కూడా బుద్ధ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సత్యారెడ్డి గారు తెలిపారు.
“బుద్ధ జయంతి – జాతీయ గౌరవ దినం కావాలి” అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని దేశమంతా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
















Comments (0)