భారతీయ విద్యా, పరిశోధనా రంగాలకు మరో గర్వకారణమైన గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్, విద్య, సాంకేతికత, కృత్రిమ మేధస్సు రంగాల్లో…

అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి అండగా నిలిచిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల స్వాతి తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ జీవన పోరాటం కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
తల్లిదండ్రులు లేని స్వాతి, తన పెదనాన్నతో కలిసి శుక్రవారం రాత్రి ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను వివరించింది. మాట్లాడటానికే ఇబ్బంది పడుతూ, తీవ్ర ఆయాసంతో తన సమస్యను వివరించిన స్వాతి పరిస్థితి ఎంపీని కలచివేసింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా ఆమె శరీరం పూర్తిగా కృశించి, చిన్నారి స్థాయికి చేరడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.
స్వాతి పరిస్థితిని గమనించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే స్పందిస్తూ తక్షణ ఆర్థిక సహాయంగా రూ.20 వేలును అందించారు. అంతేకాకుండా ఆమెకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. కొద్ది సేపు కూడా నిలబడలేని స్థితిలో ఉన్న స్వాతికి మూడు చక్రాల వాహనం అందిస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చిన ఎంపీ, ధైర్యంగా ఉండి మెరుగైన వైద్యం చేయించుకోవాలని స్వాతికి సూచించారు. ఎంపీ చేసిన ఈ మానవీయ సహాయం పట్ల స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
