ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర…

టీడీ జనార్ధన్ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు టిడి జనార్దన్ కు అందించడం సముచితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు హైదరాబాదులోని త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షులు అయిన టిడిపి జనార్దన్ కు ఎన్టీఆర్ అవార్డును ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా బహుకరించారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి , వేణుగోపాలా చారి, తెలుగు వన్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని రవిశంకర్, రసమయి సంస్థ అధ్యక్షులు ఎంకే రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంలోని ప్రధాన ఘట్టాలు విశేషాలను తనదైన శైలిలో వివరించారు పౌరాణిక చిత్రాల్లో రాముడిగా కృష్ణుడిగా రావణుడిగా ఇంకా అనేక పాత్రలలో జీవించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల కు ఆరాధ్య దైవం గా మారారని పేర్కొన్నారు. పౌరాణికం తో పాటు సాంఘిక చిత్రాలలో ఆయన ధరించిన పాత్రలు సమాజంపై ఎనలేని ప్రభావాన్ని చూపించాయని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేదల మహిళలు యువత కోసం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారని, ఓ కొత్త రాజకీయ సంస్కృతికి శ్రీకారం చుట్టారని వెంకయ్య నాయుడు అన్నారు.
మహిళల సాధికారత కోసం ఎన్టీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాలు, చేసిన నిర్ణయాలు చరిత్ర సృష్టించాయని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ ది అన్నారు. పేదల కోసం సమాజంలో అణగారిన వర్గాల కోసం ఎన్టీఆర్ తపించే వారన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు ఒక ఆంధ్రప్రదేశ్ కాక యావత్ దేశానికి ఆదర్శప్రాయమయ్యాయి అని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలో అనేక గొప్ప సంఘటనలు ఉన్నాయని, ఒకసారి పదవి కోల్పోయిన తర్వాత తిరిగి 30 రోజుల్లో ప్రజాస్వామ్య పోరాటం చేసి అధికారం కు వచ్చిన చరిత్ర ఎన్టీఆర్దన్నారు.ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలని రాబోయే తరాల వారు ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని కోరారు. ముఖ్యంగా రాజకీయాల్లో విలువలను పాదుగోల్పటానికి ఎన్టీఆర్ చేసిన కృషి అనన్య సామాన్యమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పేరిట నెలకొల్పిన అవార్డును రసమయి సంస్థ టిడి జనార్దన్ కు అందించటం ఎంతో సముచితమని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన టిడి జనార్ధన్ అత్యంత నిజాయితీపరుడని సమర్ధత గల నేత అని పేర్కొన్నారు జనార్దన్ లాంటివారు ప్రతి పార్టీకి అవసరం అని తాను భావిస్తున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.
మరో ముఖ్యఅతిథి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు పార్టీలు వేరైనా ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గౌరవం ఇచ్చేవారని దత్తాత్రేయ పేర్కొన్నారు. టీడీ జనార్ధన్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ అన్ని పార్టీల నేతలతో చక్కటి సంబంధాలు కొనసాగించటం జనార్ధన్ ప్రత్యేకత అని ఆయన అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ అన్న గారితో తన అనుబంధం ఎంతో గొప్పదని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న తనను ప్రోత్సహించి పార్టీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చారని పేర్కొన్నారు. తాను కేంద్రమంత్రి స్థాయికి వెళ్లడానికి కారణం కూడా ఎన్టీఆర్ అని అన్నారు. టీడీ జనార్ధన్ తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని ఆయనతో కలిసి పనిచేశానని వేణుగోపాల చారి తెలిపారు. ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని రాబోయే తరాల వారికి తెలియజేయడం కోసం టిడి జనార్దన్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవి అని కొనియాడారు.
తెలుగు వన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కంఠమనేని రవిశంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తరగదని అటువంటి మహానుభావుడు పేరిట నినె ల్కొల్పిన అవార్డును తన మిత్రులు టిడి జనార్దన్ కు బహుకరించటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో టీడీ జనార్దన్ కృషి ఎంతో ఉందని రవిశంకర్ తెలిపారు.
ఎన్టీఆర్ అవార్డును స్వీకరించిన టి డి జనార్ధన్ వక్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట నెలకొల్పిన అవార్డు స్వీకరించడం తనకెంతో ప్రత్యేకమని, అందుకు రసమయి వారికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు
తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో మొదలైందని ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీ శ్రేయస్సే పరమావధిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ క్రమంలో తొలుత తను ఎన్టీఆర్ ఆశీస్సులతో కృష్ణాజిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అయ్యానని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 9 సంవత్సరాలు పాటు ఆప్కాబ్ చైర్మన్ గా పని చేసినట్లు తెలిపారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఏ బాధ్యత అప్పగించిన దానిని నిబద్దతతో చేయటమే తనకు తెలిసిన పని అని జనార్ధన్ పేర్కొన్నారు
ఎన్టీఆర్ శతజయంతి ని పురస్కరించుకొని 2023లో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా అనేక కార్యక్రమాలు చేయటం తన జీవితంలో సాధించిన గొప్ప విజయం గా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భావజాలాన్ని శాశ్వతం చేయడానికి గత మూడు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ తో అనుబంధం కలిగిన సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు జర్నలిస్టులు సన్నిహితులతో ఇంటర్వ్యూలు చేయిస్తూ అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ ఆశలు ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా తమ కార్యక్రమాలు సాగుతాయని టీడీ జనార్ధన్ పేర్కొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు, రసమయి అధ్యక్షులు ఎంకే రాము చివర్లో వందన సమర్పణ చేశారు.
