ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర సంస్థగా కొనసాగుతున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెం.10ను అఫీషియల్‌గా అనౌన్స్…

రెండు నేషనల్ అవార్డ్స్.. ’35’ టీమ్‌ను అభినందించిన ‘సమ్మర్ హాలిడేస్’
ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో రెండు అవార్డ్స్ గెల్చుకుంది “35 చిన్న కథ కాదు” సినిమా. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల. మాస్టర్ అరుణ్ దేవ్ ప్రస్తుతం “సమ్మర్ హాలిడేస్” అనే బాలల చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో “35 చిన్న కథ కాదు” మూవీ టీమ్ ను అభినందించారు “సమ్మర్ హాలిడేస్” సినిమా టీమ్. “సమ్మర్ హాలిడేస్” చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – 35 చిన్న కథ కాదు బ్యూటిఫుల్ ఫిలిం. ఈ సినిమాలో అరుణ్ నటన చూస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. డైరెక్టర్ నందకిషోర్ ఎఫర్ట్స్ వల్లే ఈ రోజు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ ఇచ్చిన సంగీతం నన్ను ఇన్స్ పైర్ చేస్తుంటుంది. అరుణ్ ఇప్పుడు మా సమ్మర్ హాలిడేస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతని నటన చూస్తున్నప్పుడు కూడా ఎమోషనల్ అవుతుంటా. 35 చిన్న కథ కాదు టీమ్ కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ – తెలుగు సినిమా గర్వపడే బాలల చిత్రాన్ని అందించిన 35 చిన్న కథ కాదు టీమ్ కు నా శుభాకాంక్షలు చెబుతున్నా. ఎప్పుడో 30 ఏళ్ల కిందట బాల రామాయణం సినిమాకు తెలుగు సినిమాకు ఉత్తమ బాలల చిత్రం అవార్డ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ 35 చిన్న కథ కాదు సినిమాతో ఆ గౌరవం దక్కింది. అరుణ్ మంచి నటుడు. మా సమ్మర్ హాలీడేస్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ టైమ్ లో 35 చిన్న కథ కాదు సినిమా కోసం వాళ్ల టీమ్ ఎంత కష్టపడ్డారో చెప్పేవాడు. మా సినిమాలోని ఒక సీన్ కు రెండు పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడు. మా మూవీలో అరుణ్ పర్ ఫార్మెన్స్ చూస్తుంటే అతను నవ్వితే నేను నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను. నటుడిగా ఎదగడంలో అరుణ్ ను ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న వారి పేరెంట్స్ కు అభినందనలు. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – నేను థియేటర్ లో 35 చిన్న కథ కాదు సినిమాను మిస్ అయ్యాను. ఓటీటీలో చూశాను. కథను నమ్మి ప్రియదర్శి, నివేదా, దర్శక నిర్మాతలు ఈ సినిమాను చేశారు. వాళ్లు ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ కు హ్యాట్సాఫ్. ఓటీటీలో సినిమా చూసినప్పుడు థియేటర్ లో ఈ సినిమా మరింతగా ఆదరణ పొందాల్సింది అనిపించింది. మరింతగా ప్రేక్షకులు రీచ్ కావాల్సిన చిత్రమిది. నేను సమ్మర్ హాలీడేస్ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది 35 చిన్న కథ కాదు. నేషనల్ అవార్డ్స్ రాకున్నా ఇంతమంచి సినిమా చేసినందుకు డైరెక్టర్ నందకిషోర్ ను సత్కరించాలని అనుకున్నా. ఆయన ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయాలి. సోలో హీరోగా మూవీస్ చేస్తున్న ప్రియదర్శి ఈ చిత్రంలో కీ రోల్ చేయడం మూవీకి బాగా కలిసొచ్చింది. నివేదా థామస్ లాగే ప్రియదర్శి ఉండటం వల్ల ప్రేక్షకులకు ఈ సినిమా గురించి తెలిసింది. ఈ చిత్రంలో విశ్వదేవ్ నటన ఆకట్టుకుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ చేసిన ఈ చిత్ర పాటలు ఇప్పటికీ తరుచూ వింటుంటాను. నా స్నేహితుడు సృజన్ కు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ఏంటి అనేది ఈ సినిమాతో నాకు అర్థమైంది. ఆయన మీద గౌరవం పెరిగింది. అరుణ్ మా సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నప్పుడు ఈ పాత్రకు పర్పెక్ట్ అనిపించాడు. అరుణ్ ను చూస్తే మా ఇంట్లో అబ్బాయిలా అనిపిస్తాడు.
యాక్టర్ విశ్వదేవ్ మాట్లాడుతూ – నందకిషోర్ ఈ కథ చెప్పినప్పుడు మేము ఎంత ఎగ్జైట్ అయ్యామో థియేటర్స్ లో ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయ్యారు. ఈ సినిమాకు ఒక డ్రీమ్ టీమ్ కుదిరింది. వాళ్లంతా సినిమాను నమ్మి పనిచేయడం వల్లే ఈరోజు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. గతంలోనూ మా సినిమా ఏ ఫిలింఫెస్టివల్ కు వెళ్లినా అక్కడ అవార్డ్స్ సాధిస్తూనే ఉంది. ప్రియదర్శి మా సినిమాకు ఎంత సపోర్ట్ గా నిలిచారో మా టీమ్ అందరికీ తెలుసు. అరుణ్ ఎంతో సహజంగా పర్ ఫార్మ్ చేస్తాడు. మా సినిమాకు వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్ గా నేను సమ్మర్ హాలీడేస్ మూవీ నుంచి క్రష్ సాంగ్ విన్నాను. మళ్లీ మా 35 చిన్న కథ కాదు మ్యూజిక్ వైబ్ రీకాల్ చేసుకున్నాను. 35 చిన్న కథ కాదు సినిమా టీమ్ మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – మా టీమ్ ను అభినందిస్తూ ఈవెంట్ చేస్తున్న ధీరజ్ గారికి థ్యాంక్స్. 8 ఏళ్ల కిందట నేను ఈ కథ విన్నా. 2024లో మా మూవీ వచ్చింది. ఈ సినిమా సెట్స్ లో ఉండగా డైరెక్టర్ నందకిషోర్ రోజూ ఆధునిక మహాభారతం పుస్తకం తెచ్చేవాడు. ఆ పుస్తకం చదువుతూ ఆధునిక రామాయణం తెరకెక్కించాడు. ఇలాంటి గొప్ప సినిమా నా లైఫ్ లో మళ్లీ చేయలేనేమో. అలాంటి అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. మా అమ్మా నాన్న చేసుకున్న పుణ్యం వల్లే నాకు ఈ కథ వచ్చిందని భావిస్తా. డైరెక్టర్ నందకిషోర్ ఒక యుద్ధం చేస్తే గానీ ఈ కథ బయటకు రాలేదు. మంచి సినిమా వచ్చినప్పుడు మన ప్రేక్షకులు ఎంత ప్రేమిస్తారు అనేది ఈ సినిమాతో మేము చూశాం. ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తిని నింపారు. ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. అందుకే ఈ సినిమా చేశా. మీకూ మా పేరెంట్స్ గుర్తుకువస్తారు. నేషనల్ అవార్డ్ అందుకున్న అరుణ్ కు కంగ్రాట్స్. వాళ్ల ఇంట్లో గిన్నెల కంటే అవార్డ్స్ ఎక్కువ ఉండే రోజులు రాబోతున్నాయి.
మాస్టర్ అరుణ్ దేవ్ మాట్లాడుతూ – 35 చిన్న కథ కాదు ఇది చాలా పెద్ద కథ. ఓటమి అనే మైనస్ నుంచి గెలుపు అనే ఫ్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాను దాటుకున్నాం నేషనల్ అవార్డ్స్ కు చేరుకున్నాం. ఓడిపోతున్నప్పుడు ధైర్యం చెప్పేందుకు తలా ఒక చేయి అందిస్తారు. అలా మా టీమ్ అందరి చేతులు నా మీద పడి నాకు బలాన్నిచ్చాయి, జాతీయ పురస్కార గౌరవాన్ని అందించాయి. ఈవెంట్ చేసి మమ్మల్ని సత్కరిస్తున్న ధీరజ్ గారికి థ్యాంక్స్. ఆయన నిర్మిస్తున్న సమ్మర్ హాలీడేస్ లో నాకు అవకాశం కల్పించారు. మా పేరెంట్స్, ఫ్యామిలీ, టీచర్స్ సపోర్ట్ వల్లే ఈ స్థాయికి రాగలిగాను. ఈ జాతీయ అవార్డ్ ను మా అమ్మకు అంకితమిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ – తెలుగు సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా అప్పట్లో బాల రామాయణం సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు మా సినిమాకు ఆ గౌరవం దక్కింది. ఈ చిత్ర దర్శకుడిగా గర్వపడుతున్నాను. మా సినిమా టీమ్ ను సత్కరించాలని ఈవెంట్ నిర్వహిస్తున్న ధీరజ్ గారికి థ్యాంక్స్. వారు సమ్మర్ హాలీడేస్ అనే సినిమా చేస్తున్నారు. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న సమ్మర్ హాలీడేస్ సినిమాకు 2028లో నేషనల్ అవార్డ్ వస్తుంది. ఆ సన్మాన కార్యక్రమంలో నేను అతిథిగా పాల్గొంటా. ఎంతోమంది ఎన్నో సందేహాలు వెలిబుచ్చిన కథ ఇది. అలాంటి టైమ్ లో మనం కథ విన్నప్పుడు కలిగిన అనుభూతిని ప్రేక్షకులకు పంచాలని ముందుకొచ్చారు, నాకు సపోర్ట్ గా నిలపడ్డారు మా ప్రొడ్యూసర్స్ సృజన్, సిద్ధార్థ్. వాళ్లు ఈ సినిమా కోస నిలబడకపోతే అరుణ్ వయసు పెరిగేది. దర్శకుడిగా అవకాశాల కోసం తిరుగుతూ నా గెడ్డం మరింత నెరిసేది. మా ప్రొడ్యూసర్స్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని నమ్ముతున్నా. మనల్ని నమ్మి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. లేకపోతే ఇకపై వాళ్ల బ్యానర్ లో రావాల్సిన కొత్త సినిమాలు ఆగిపోతాయి. అలాంటి బాధ్యతతోనే నేను సినిమా రూపొందించాను. మా సినిమాకు ఇలాంటి గౌరవాలు, ప్రేక్షకుల అభిమానం దక్కకుంటే ఇలాంటి మరో సినిమా నిర్మించేందుకు ఎవరూ ముందుకు రారు. మా సినిమానే ఉదాహారణగా చూపిస్తారు. మా సినిమాకు నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన జ్యూరీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అన్నారు.
తమ అబ్బాయి కోరుకున్న రంగంలో రాణించేలా తాము ప్రోత్సహించడం వల్లే ఈ రోజు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ దక్కిందని, అరుణ్ పేరెంట్స్ అని మమ్మల్ని పిలిచేలా గౌరవాన్ని తీసుకొచ్చాడని ఈ సందర్భంగా అరుణ్ దేవ్ పేరెంట్స్ సురేష్, సత్యవాణి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
