Skip to content

అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి – ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు

మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతోంది. 2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, అభిమానులు తమకు ఇష్టమైన సూపర్‌హీరోల వేషధారణలో థియేటర్లకు రావడం వంటి ఎన్నో ప్రత్యేక అనుభవాలను ఈ సినిమా అందించింది.

ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో థియేటర్లలోకి వస్తోంది. అలాగే త్వరలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ రాబోతున్న నేపథ్యంలో ఎండ్‌గేమ్‌ను మరోసారి పెద్ద తెరపై చూడటానికి మరింత ఆసక్తి నెలకొంది.

*1. మార్వెల్‌లో అతిపెద్ద ఈవెంట్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు* 22 సినిమాల్లో కొనసాగిన కథలు, పాత్రలను ఒకే సినిమాలో కలిపిన ఘనత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ఉంది. ఈ సినిమాను మరోసారి పెద్ద తెరపై చూడటం ద్వారా ఆ భారీ అనుభూతిని మళ్లీ ఆస్వాదించవచ్చు.

*2. కెప్టెన్ అమెరికా ఐకానిక్ సీన్*
‘ఎండ్‌గేమ్’లో కెప్టెన్ అమెరికా, థానోస్‌తో పోరాడే సన్నివేశం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్‌గా నిలిచింది. అవెంజర్స్ హీరోలు ఒక్కొక్కరుగా రావడం, ఆ సన్నివేశం ప్రేక్షకుల్లో కలిగించిన ఉత్సాహం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

*3. బ్లాక్ విడోకు నివాళి* నటాషా రోమానోఫ్‌ (బ్లాక్ విడో) త్యాగం ‘ఎండ్‌గేమ్’లో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాల్లో ఒకటి. అవెంజర్స్ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆమె, అందరినీ తిరిగి తీసుకురావడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. ‘ఎంకోర్’ ద్వారా అభిమానులు మరోసారి బ్లాక్ విడోను గుర్తు చేసుకోవచ్చు.

*4. ఐరన్ మ్యాన్‌ను మరోసారి తెరపై చూసే అవకాశం*
‘ఎండ్‌గేమ్’లో టోనీ స్టార్క్‌ (ఐరన్ మ్యాన్)కు వీడ్కోలు అభిమానులను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్‌కు ఇదొక కీలకమైన ముగింపు. ఇప్పుడు ఆయన మళ్లీ MCUలో డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో, ఎండ్‌గేమ్‌ను మరోసారి చూడటం అభిమానులకు మరింత ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది.

*5. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై ప్రత్యేక ఆసక్తి*
‘ఎండ్‌గేమ్: ఎంకోర్’లో మరో ముఖ్యమైన ఆకర్షణ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూ. మార్వెల్ యూనివర్స్‌లోని విభిన్న ప్రాంతాలకు చెందిన హీరోలను కలుపుతూ కొత్త కథను తీసుకురాబోతున్న నేపథ్యంలో, ఈ ఎంకోర్‌ ప్రదర్శన తదుపరి అవెంజర్స్ కథపై ఆసక్తిని పెంచనుంది.

‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25న భారత్‌లో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Back To Top