శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం…

పవన్ కళ్యాణ్ గారితో ఆ భేటీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. సంగీత దర్శకుడు అజయ్ అరసాడ
తెలుగు చిత్రసీమలో విభిన్నమైన కథలు, కాన్సెప్ట్స్‌కు తన సంగీతంతో ప్రత్యేకతను తీసుకొస్తున్న యువ సంగీత దర్శకుల్లో అజయ్ అరసాడ ఒకరు. ‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్‌లతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైజాగ్‌లో పుట్టి పెరిగిన అజయ్.. సినిమాల్లోకి రాకముందు టీసీఎస్‌లో ఏడేళ్లు ఉద్యోగం చేశారు. సంగీతంపై ఉన్న ఆసక్తితో ఉద్యోగం చేస్తూనే సినిమాలకు పనిచేయడం ప్రారంభించారు. ‘గూఢచారి’కి కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసిన ఆయన, అనంతరం సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవిశ్రీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని చెప్పే అజయ్.. తన కెరీర్లో ఎదురైన అనుభవాలు, సంగీతంపై తన ఆలోచనలు, దర్శకుల పనితీరు, ఏఐ ప్రభావం, క్రెడిట్స్ విషయంలో ఎదురైన అనుభవాలు, పవన్ కళ్యాణ్‌తో జరిగిన ఆసక్తికరమైన సమావేశం గురించి మాట్లాడారు.

సంగీత రంగంలోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. అందుకే చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేది. దేవిశ్రీ ప్రసాద్ నాకు చాలా పెద్ద స్ఫూర్తి. టీసీఎస్‌లో ఏడేళ్లు ఉద్యోగం చేసినా సంగీతాన్ని మాత్రం వదల్లేదు. మా అమ్మ, భార్య ఇచ్చిన సపోర్ట్‌తో సినిమాల్లోకి వచ్చాను. శ్రీచరణ్ ద్వారా ‘గూఢచారి’లో కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది.
చిన్న సినిమాలకు పని చేయడం మీ కెరీర్‌కు ఎలా ఉపయోగపడింది?
చిన్న సినిమాలు చేయడం వల్ల నాకు ఎలాంటి నెగెటివ్ అనుభవం లేదు. నేను పనిచేసిన ప్రొడక్షన్స్ బాగుండటంతో పేమెంట్స్ విషయంలో కూడా ఇబ్బందులు రాలేదు. ప్రతి సినిమాను ఓ అవకాశంగా భావించి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను.
ఒకే తరహా సంగీతానికి పరిమితం కాకుండా పనిచేయాలనుకుంటున్నారా?
అవును. అన్ని రకాల జానర్స్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చే కథకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించడమే నా స్టైల్. కథ మాస్ అయితే మాస్ మ్యూజిక్ ఇవ్వాలి. కథకు కొత్త సౌండ్ అవసరమైతే కొత్తగా ట్రై చేయాలి. కథను బట్టి సంగీతం మారాలి కానీ, నేను ఒకే ఫార్ములాలో ఉండకూడదనుకుంటాను.
పాట విషయంలో సింగర్ ఎంపికకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు?
చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. కానీ పాటకు ఎవరు సరిపోతారనేది నాకు ముఖ్యం. బడ్జెట్ కంటే పాట ముఖ్యమని భావిస్తాను. కెరీర్ ప్రారంభంలో అనురాగ్ కులకర్ణితో పాడిస్తానంటే ఓ నిర్మాత వద్దన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆ అనుభవం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.
ఓటీటీ వల్ల సంగీతం ప్రభావం తగ్గుతోందని ఎందుకు అంటున్నారు?
థియేటర్లో ప్రేక్షకుడు సౌండ్‌ను మరో స్థాయిలో అనుభవిస్తాడు. అందుకే మేం థియేటర్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్, స్కోర్‌ను డిజైన్ చేస్తాం. కానీ ఓటీటీలో అదే అనుభూతి పూర్తిగా రావడం లేదు. ‘వికటకవి’ థియేటర్లో చూస్తే నా స్కోర్‌కు ఉన్న ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. ఓటీటీలో దాదాపు సగం ప్రభావమే కనిపిస్తుంది.
ఏఐ మ్యూజిక్ డైరెక్టర్ల అవకాశాలను తగ్గిస్తుందని అనుకుంటున్నారా?
ప్రస్తుతం అలా అనిపించడం లేదు. ఏఐని ఒక టూల్లా ఉపయోగించుకోవచ్చు. కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలంటే కథను అర్థం చేసుకోవాలి, భావోద్వేగాలను పట్టుకోవాలి, సన్నివేశానికి తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించాలి. ఏఐని ఉపయోగించడం వేరు, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆలోచించడం వేరు.
పవన్ కళ్యాణ్ గారితో మీ భేటీ ఎలా జరిగింది?
జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ చేస్తున్నాను. మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారి సమావేశం సందర్భంగా నేను చేసిన ఓ స్కోర్‌ను ఆయన చూశారు. నా వర్క్ నచ్చి నన్ను పిలిపించారు. పర్సనల్‌గా మాట్లాడారు. దాదాపు అరగంట పాటు చాలా విషయాలు చర్చించుకున్నాం. రాజకీయ కార్యక్రమాలకైనా, పీకే క్రియేటివ్స్ బ్యానర్లో చేసే ప్రాజెక్ట్లకైనా కలిసి పనిచేద్దామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు మీకు ఎలా అనిపించింది?
నిజం చెప్పాలంటే మొదట కొంచెం ఆశ్చర్యపోయాను. ఐదారు నిమిషాలు మాట్లాడి ఫోటో దిగి వస్తానని అనుకున్నాను. కానీ ఆయన ఒక్కరే ఉండి నాతో చాలా సేపు మాట్లాడారు. చాలా విషయాల గురించి చర్చించుకున్నాం. అది నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం.
మీ బోస్ స్పీకర్ గురించి పవన్ కళ్యాణ్ గారు సరదాగా మాట్లాడటం ఎలా అనిపించింది?
నా దగ్గర కాఫీ మగ్లా కనిపించే బోస్ స్పీకర్ ఉంటుంది. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ‘ఇదేంటి?’ అని అడిగారు. కాఫీ కప్పులా ఉందని సరదాగా మాట్లాడారు. ‘కాఫీ పట్టుకొచ్చావా?’ అని జోక్ చేశారు. ఆయన నాతో అలా సరదాగా మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

మీరు ఎక్కువగా మీడియా, ఈవెంట్లలో ఎందుకు కనిపించరు?
నేను కొంచెం ఇంట్రోవర్ట్. నా పని గురించి నేనే బయట చెప్పుకోవడం నాకు నచ్చదు. సెల్ఫ్ ప్రమోషన్ చేయడం కూడా పెద్దగా తెలియదు. నా పని మాట్లాడాలని కోరుకుంటాను. అందుకే ఈవెంట్లు, మీడియా కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించను.
మీకు రావాల్సిన క్రెడిట్ వేరే వాళ్లకు వెళ్లిన సందర్భాలున్నాయా?
‘ఆయ్’ విషయంలో అలాంటి అనుభవం వచ్చింది. రామ్ మిర్యాల గారు రెండు పాటలు ఇచ్చారు. మిగతా వర్క్ అంతా నేను చేశాను. కానీ మీడియాలో ఆయన పేరు ఎక్కువగా కనిపించింది. బన్నీ వాస్ గారు ఈ విషయం గుర్తించి ప్రతి ఈవెంట్లో నా పేరును చెబుతూ వచ్చారు. ‘సేవ్ ది టైగర్స్’ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను మాత్రం నా టీమ్‌లో ఎవరు ఎంత పని చేశారో వారికి క్రెడిట్ ఇవ్వాలని ఎప్పుడూ చూస్తాను.
పదేళ్ల ప్రయాణం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి?
ఈ ప్రయాణం నాకు ముఖ్యంగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కరోనా వల్ల కొంత సమయం కోల్పోయినా, పదేళ్లలో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలాంటి కథకైనా సంగీతం అందించగలననే నమ్మకం ఉంది. పెద్ద కమర్షియల్ సినిమాకు కూడా మంచి సంగీతం ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక నా సామర్థ్యాన్ని మరింతగా చూపించే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
