Skip to content

‘ఓ.! సుకుమారి’లో నా దామిని పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ఐశ్వర్య రాజేష్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు

ఓ.! సుకుమారి కథ ఎలా మొదలైంది?

మహేశ్వర్ రెడ్డి గారు ముందుగా సంప్రదించారు. దర్శకుడు భరత్ దర్శన్ కథ చెప్పారు. తర్వాత నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది.

-ఇందులో నేను చేసిన దామిని పాత్రకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ముట్టుకుంటే షాక్ కొడతాను(నవ్వుతూ) అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది దామిని కథ. ఆ పాత్ర ప్రయాణాన్ని ప్రేక్షకులు ఎంతో ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.

కొత్త దర్శకులతో పని చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది?

-మనందరం కూడా ఒకప్పుడు కొత్తవాళ్లమే. నేను ఇప్పటివరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేశాను. ఒక దర్శకుడు కథ చెప్పే విధానం, ఆయనపై కలిగే నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’లాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా మళ్లీ వైవిధ్యమైన పాత్రలనే ఎంచుకుంటున్నారు. మీ కెరీర్ లో విజయాన్ని, పరాజయాన్ని ఎలా చూస్తారు?

నేను తమిళ్ లో వరుసగా ఐదు హిట్లు ఇచ్చాను. ఆ సంవత్సరం మా ఇంటికి చాలా బొకేలు వచ్చాయి. తర్వాత ఏడాది రెండు హిట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఇంటికి వచ్చే బొకేల సంఖ్య కూడా తగ్గింది. బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా నాలో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.

ఓ.! సుకుమారి’లో పొలిటికల్ టచ్ కూడా ఉందా?

ఇందులో తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా కనిపిస్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఎవరికీ ముందు కొడుకు పుడితే అతనికే ఆస్తి రాస్తానని తండ్రి నిర్ణయిస్తాడు. అదే సమయంలో నేను తనకి పరిచయం అవుతాను. నేను ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిని. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథ. సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి.

తిరువీర్‌తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?

-ఆయన చాలా మంచి నటుడు. ఈ పాత్రను ఎంతో సహజంగా చేశారు. ‘టక్ జగదీష్’ తర్వాత ఆయనతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

నిర్మాత మహేశ్వర్ రెడ్డి గురించి?

-మహేశ్వర్ రెడ్డి గారు ఈ సినిమా కథతో నన్ను సంప్రదించారు. ఆయన ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మ్యూజిక్ గురించి?

భరత్ చాలా కొత్తగా సంగీతం అందించారు. పాటలన్నీ వినడానికి, చూడడానికి చాలా ఫ్రెష్‌గా, అందంగా ఉంటాయి.

మీకు తెలంగాణ యాస కష్టంగా ఉంటుందా?

నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఏ యాస కూడా నాకు కష్టంగా అనిపించదు. అన్ని ప్రాంతాల యాసల్లో మాట్లాడగలను. తెలుగు, తమిళ భాషల్లోని వివిధ యాసల్లో నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

సినిమాలతో పాటు వరుసగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు కదా?

-ఏ ప్లాట్‌ఫామ్‌నీ వదలకూడదని అనుకుంటాను. వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి రీచ్ ఉంటుంది. నేను చేసిన ‘సుడల్’ వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ లభించింది. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా దాని గురించి చాలామంది మాట్లాడేవారు. అది 34 భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ కోసం ఒక ప్రాజెక్ట్, హాట్‌స్టార్ కోసం మరో వెబ్ సిరీస్ చేస్తున్నాను.

 

మీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడమే ఇష్టమా?

అవును. ఒకప్పుడు చాలామంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. నేనూ అదే నిజం అనుకునేదాన్ని. అందుకే త్వరగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకున్నాను(నవ్వుతూ) అన్నీ కలుపుకొని ఇప్పటివరకు దాదాపు 50 చేశాను. నేను చేసిన దాదాపు ప్రతి పాత్ర ఇష్టంతోనే చేశాను.

 

మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. నీలాంబరి తరహా పాత్రలు చేయాలని ఉంది. అలాగే ‘అబ్సెషన్‌’ లాంటి పాత్రల్లో కూడా నటించాలని ఉంది.

ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏమి చెబుతారు?

ఇది ఒక క్యూట్ విలేజ్ స్టోరీ. చాలా మంచి వినోదం ఉంటుంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

Back To Top