హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ తెలంగాణ…

ఎన్టీఆర్ ఆశయాలు నేటికీ మార్గదర్శకం: మంత్రి తుమ్మల
అన్న ఎన్టీ రామారావు తెలుగు జాతికి స్ఫూర్థి ప్రదాత, తరతరాలు ఆయన భావజాలం ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో శనివారం నాడు జరిగిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను రామారావు గారి అభిమానంతో, ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగానని ఆయన భావజాలం, ఔనత్యం చాలా గొప్పదని. బడుగు, బలహీన వర్గాల తో పాటు వెనుకబడిన ప్రజలకు కూడా రాజకీయంగా చేయూతనిచ్చిన మహానాయకుడు రామారావు గారని ఆయన శ్లాకించారు.
ఎన్టీఆర్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయటానికి టి.డి. జనార్ధన్ నాయకత్వంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు కావడం ఎంతో సముచితంగా ఉందని, ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ స్ఫూర్తినిస్తూంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు.
మాజీ శాసన సభాపతి ఎమ్. మధుసూదనాచారి మాట్లాడుతూ రాజ్యాధికారం లేని ఎన్నో కులాలను గుర్తించి వారికి సముచితమైన స్థానం ప్రసాదించిన ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ అని, తాను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ను తలవకుండా ఉండలేనని ఎన్టీఆర్ తన అణువణువులో ఉన్నారని పేర్కొన్నారు. తమ కులానికి రాజ్యాధికారం కల్పించిన నాయకుడిగా ఎన్టీఆర్ ను తానెప్పుడూ గౌరవిస్తానని పేద ప్రజల ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రసంశించారు.
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ 4వ వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎన్టీఆర్ తనయులు రామకృష్ణ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రొడ్యూసర్స్ కేఎస్ రామారావు, టి.ప్రసన్నకుమార్, భగీరథ, విక్రమ్, గుమ్మడి గోపాలకృష్ణ, ప్రొఫెసర్ వెంకట్రావు, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుగపురుషుడు, శకపురుషుడు, తారకరామం, సజీవ చరిత్ర వంటి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఇప్పటిదాకా ప్రచురించిన పుస్తకాలను అతిథులకు అందజేశారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో చెన్నై లోని ఆయన నివాసాన్ని కొనుగోలు చేసి, మ్యూజియం గా తీర్చిదిద్దిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారిని ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ – ఆయన శతజయంతి సందర్భంగా డిజిటల్ గా ఆయన చరిత్రను పొందుపరచాలని నిర్ణయించాం. అలా మా లిటరేచర్ కమిటీ ప్రారంభమై ఇప్పటికి నాలుగేళ్లవుతోంది. రోజుకో పోస్ట్ చొప్పున చేస్తూ వచ్చాం, అనేక పుస్తకాలు ప్రచురించాం. ఎన్నో దేశాల్లో పర్యటించాం. ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఏ దేశం వెళ్లినా అనూహ్యమైన స్పందన వచ్చేది. మేము నిర్వహించిన విదేశీ కార్యక్రమాల్లో సకుటుంబంగా మన భారతీయులు పాల్గొనేవారు. ఈ రోజు మా లిటరేచర్ కమిటీ నాలుగో వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇది ఆత్మీయ సమావేశంలా అనిపిస్తోంది అన్నారు.
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ఎన్టీఆర్ ప్రజా యాత్ర చేయడం, రాజకీయాల్లోకి రావడం, సీఎం కావడం మన రాజకీయాల్లో ఒక సంచలనం, ఒక చరిత్ర. రాజకీయంగా ఆయనను విమర్శించిన వారున్నారు. అయితే తన ప్రసంగాలతో విమర్శకులతో కూడా ప్రశంసలందుకున్న నాయకుడు. జర్నలిస్టులకు కూడా సహాయం చేసిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.
లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ – తెలుగు భాషకు, తెలుగు నేలకు ఆసేతు హిమాచలం గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన వల్ల తెలుగు వారికి ఇతర రాష్ట్రాల్లోనూ గౌరవం ఏర్పడింది. మన భాష, మన సంస్కృతి, మన నేల కోసం నిరంతరం తపన పడిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ – ఎన్టీఆర్ లేకుంటే నా జీవితం లేదు. నా ఇంట్లో ఆయన ఒక్కరి ఫొటో తప్ప ఇంకెవరి ఫొటోస్ పెట్టుకోలేదు. ఎన్టీఆర్ తో కలిసి మంత్రిగా పనిచేశాను. మధ్యవర్తులు లేని రాజకీయాలను నడిపారు ఎన్టీఆర్. పేదవారికి, బతుకే కష్టమైన వారికి ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి అన్నారు.
నిర్మాత టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు ఎన్టీఆర్. డీ గ్లామర్ పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉండగానే నట జీవితాన్ని త్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా గతంలో ఎవరూ ప్రవేశ పెట్టనన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ – నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ ఏమిటో తెలుగు వారందరికీ తెలుసు. ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర ఏంటి అనేది మరోసారి చెప్పడానికే ఈ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కృషి చేస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ కమిటీ ఏర్పడిందని భవిష్యత్తులో కూడా కమిటీ మరింతగా కృషి చేస్తుందని ఆశిస్తూ అభినందనలు తెలిపారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – తమ కుటుంబం అందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య నటుడు అని, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగు వారి జీవితాల్లో గొప్ప మలుపు తీసుకొచ్చారని ఆయన ఒక ప్రభంజనంలా ప్రజా జీవితంలో అడుగు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసిన మహనీయుడని ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నట్లుగా భావిస్తున్నామని అన్నారు.
నిర్మాత కైకాల నాగేశ్వరరావు, తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు విక్రమ్ పూల ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ ను, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిర్మాత డి.వి.కె. రాజులని మిగతా కమిటీ సభ్యులు సత్కరించారు. శకపురుషుడు కన్నడంలోకి అనువదిస్తున్న డా. ఆర్. దేవన్నను చైర్మన్ డి.టి. జనార్థన్, మంత్రి తుమ్మల సత్కరించారు.
కార్యక్రమాన్ని నాటక రంగ సంస్థ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కళారత్న భగీరథ నిర్వహించారు. దొప్పలపూడి రామ్ మోహన్ రావు వందన సమర్పణ చేశారు.

