వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్'…

చిన్న సినిమాల సమస్యలపై స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఇది ఒక పెద్ద మాఫియాగా మారిందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తను దర్శకత్వం వహించి నటించిన ‘ఓ అందాల రాక్షసి’ విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రెస్ మీట్‌కు నిరాకరించడంతో, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి పరిశ్రమలోని చీకటి కోణాలు ఉన్నాయంటూ ఎండగట్టారు.
“నేను ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడుతుంటే, తెలుగు ఫిల్మ్ చాంబర్ లోపల కూర్చొని తమ గురించే మాట్లాడతాననే భయంతో నాకు అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడానికి నిరాకరించారు” అని షెరాజ్ మెహదీ ఆరోపించారు. హైదరాబాద్ లోకల్స్ అయిన మనకే అక్కడ అర్హత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తెలుగు ఫిల్మ్ చాంబర్లో ప్యూన్ నుండి ప్రెసిడెంట్ వరకు అందరికీ సమస్యలు తెలుసని, కానీ అక్కడ పనిచేసే వారికి ఎలాంటి పవర్స్ లేవని, వారంతా కేవలం బొమ్మల్లా మారిపోయారని విమర్శించారు. చాంబర్ పెద్దల్లో మమకారం పోయి అహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు.
చిన్న బడ్జెట్ సినిమాలకు థియేటర్లు, ఓటీటీ, ఆడియో రైట్స్, శాటిలైట్, ఇతర భాషల రైట్స్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని షెరాజ్ పేర్కొన్నారు. “సిటీలో 20 థియేటర్లు ఇస్తామని చెప్పి తీరా చూస్తే నాకు కేవలం 5 థియేటర్లు మాత్రమే కేటాయించారు. అందుకే ఆనాడు రిలీజ్ క్యాన్సిల్ చేశాను” అని చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఓటు హక్కు కావాలంటే కనీసం మూడు సినిమాలు రిలీజ్ అయి ఉండాలని, 25 స్క్రీన్స్ ఉండాలనే నిబంధన పెట్టడం దారుణమన్నారు. డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కడూ ప్రొడ్యూసరేనని, ఒక థియేటర్ లో వేసినా అతనికి ఓటు హక్కు కల్పించేలా రూల్స్ మారాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఫిల్మ్ క్లబ్లో చిన్న నిర్మాతలు అడుగుపెట్టకుండా ఏకంగా రూ. 10 లక్షల మెంబర్షిప్ ఫీజు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు, దీనిని రూ. 1 లక్షకు తగ్గించాలని కోరారు.
థియేటర్ల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు
చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న ఏషియన్ థియేటర్స్ సునీల్ గారితో పాటు పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలకు తాము ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినట్లు షెరాజ్ మెహదీ వెల్లడించారు. ఇండస్ట్రీ పెద్దలైన భరత్ భూషణ్ లాంటి వారు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని, ఈ ఈగోల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టార్ హీరోలు ఇంట్లోని సమస్యలు పట్టించుకోవాలి!
పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరిపై షెరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న సినిమాలకు సపోర్ట్ ఇస్తానని చెప్పారు, ఆయనపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో ఒక స్టార్‌గా ఎదగాలంటే కేవలం సినిమాలు చేయడం కాదు, ఇక్కడి సమస్యలను కూడా చూడాలి. ప్రెస్ మీట్ల కోసం మీడియా మిత్రులు గంటల తరబడి వేచి చూసే సంస్కృతి మారాలి. టాలీవుడ్లో ఉన్న బాలకృష్ణ, సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ లందరికీ నేను ఒకటే చెప్తున్నా.. మీరు బయట చేసే పుణ్యకార్యాలు మాత్రమే కాదు, ముందు మన ఇల్లు అయిన తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలను పట్టించుకోండి” అని పిలుపునిచ్చారు. ఇవాళ చిన్న సినిమాలకు వస్తున్న సమస్యలు రేపు పొద్దున స్టార్ హీరోల సినిమాలకు కూడా వస్తాయని హెచ్చరించారు.
‘ఓ అందాల రాక్షసి’ భారీ రీ-రిలీజ్
తాను చేస్తున్న ఈ పోరాటానికి వెనుక వందలాది మంది మద్దతుగా నిలుస్తున్నారని, ఇవాళ వందల్లో ఉన్న ఈ సంఖ్య రేపు వేలల్లోకి మారుతుందని షెరాజ్ స్పష్టం చేశారు. తానేమీ పిరికివాడిని కాదని, లీగల్ ఫైట్ అయినా, యుద్ధం అయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం ఒక మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ఉన్న సినిమా అని, ప్రేక్షకులు థియేటర్లో ఒక్క నిమిషం కూడా కదలకుండా చూసే అద్భుతమైన సినిమా అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తగినన్ని థియేటర్లు, ఓటీటీ, ఆడియో రైట్స్ సాధించుకుని అతి త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు షెరాజ్ మెహదీ ధీమా వ్యక్తం చేశారు.
