Skip to content

సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’జూలై 17న రీ రిలీజ్

మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రక్త చరిత్ర’ చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో చక్కటి ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 17న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అప్పట్లో ఎలాంటి ఒత్తిడులు, భయాలకు లొంగకుండా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. నటీనటులు తమ, తమ పాత్రలలో ఒదిగిపోయిన విధానం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ , అప్పట్లో ఆయన ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచాయి. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర అంటూ సాగే నేపథ్య గీతంతో పాటు కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అనే మరో పాటతో కలుపుకుని కథానుసారం, సందర్భానుసారమైన రెండు పాటలు ఇందులో ఉన్నాయి. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని చాలా రోజులుగా ప్రేక్షకులు కోరుతుండటంతో పాటు నేటితరం యూత్ కు కూడా వాస్తవిక కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

Back To Top