తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘బిచ్చగాడు’ వంటి…

‘సింగ్ గీతం’లో స్ట్రాంగ్ విలన్ పాత్రలో కనిపించనున్న శాలిని కొండెపుడి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఖాయం
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హీరోయిన్ శాలిని కొండెపుడి మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీగా రూపొందిందని ఆమె తెలిపారు. ఇలాంటి జానర్‌లో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదని, ప్రతి సంభాషణ కూడా సంగీత రూపంలో సాగడం ఈ చిత్ర ప్రత్యేకత అని చెప్పారు. ‘కుబేరపురం’ అనే ఫిక్షనల్ గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో తాను పోషించిన పాత్ర గురించి మాట్లాడుతూ, సాధారణ విలన్ పాత్రలా కాకుండా అనేక భావోద్వేగాలు, షేడ్స్ కలిగిన బలమైన పాత్రలో కనిపిస్తానని శాలిని తెలిపారు. తాను నమ్మిందే నిజమని భావిస్తూ, అనుకున్నది సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్లే వ్యక్తిత్వం కలిగిన పాత్ర అని చెప్పారు. హీరో, హీరోయిన్ పాత్రలతో సమానంగా తన పాత్ర కూడా కథలో కీలకంగా ఉండటంతో పాటు వినోదాన్ని పంచుతుందని వెల్లడించారు. ఇలాంటి అరుదైన పాత్రలు తరచుగా రావని, సింగీతం గారి చిత్రంలో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
సినిమాలో ప్రధాన సవాలు మాటలను పాటల్లా పాడటమేనని శాలిని వెల్లడించారు. సాధారణంగా పాటలు పాడటం ఒకటైతే, ప్రతి డైలాగ్‌ను సంగీతాత్మకంగా పలకడం పూర్తిగా భిన్నమైన ప్రక్రియ అని చెప్పారు. ఈ కోసం చిత్రబృందం అనేక వర్క్‌షాప్స్ నిర్వహించిందని తెలిపారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి గొప్ప బలమని, మాటలను పాటలుగా మలచడంలో ఆయన అసాధారణ ప్రతిభ కనిపిస్తుందని ప్రశంసించారు.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి నిర్మాణ సంస్థలు కొత్త ఆలోచనలను ప్రోత్సహించే ధైర్యం ఉన్నవని శాలిని పేర్కొన్నారు. సినిమా పట్ల ఉన్న అభిరుచి, నమ్మకం వల్లే ఇలాంటి వినూత్న ప్రయోగాలు సాధ్యమవుతాయని చెప్పారు. ‘సింగ్ గీతం’ విజయం సాధిస్తే మరిన్ని కొత్త తరహా కథలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ‘మై డియర్ దొంగ’ చిత్రానికి కథ రాసిన తాను త్వరలోనే దర్శకురాలిగా కూడా పరిచయం కానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కామెడీ జానర్‌లో ఓ కథను సిద్ధం చేస్తున్నానని, ప్రేక్షకులను నవ్వించే చిత్రాలు రూపొందించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.


Comments (0)