Skip to content

సునీత తనయుడు ఆకాష్ హీరోగా ‘కొత్త మలుపు’.. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’ విడుదలకు సిద్ధమైంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మించారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘కొత్త మలుపు’లో ప్రేమ, భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం సమపాళ్లలో ఉండనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనుండగా, వారి మధ్య సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చెబుతున్నారు. కోనసీమ అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యశ్వంత్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రేమకథకు సస్పెన్స్ అంశాలను జోడించి వినోదాత్మకంగా చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. హీరో ఆకాష్, హీరోయిన్ భైరవి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పారు. గాయని సునీత తన కుమారుడు ఆకాష్ కష్టపడే వ్యక్తి అని, ఈ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు.

మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత తాటి బాలకృష్ణ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వంటి ప్రముఖ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపొందిన ‘కొత్త మలుపు’ జూన్ 12న థియేటర్లలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top