Skip to content

‘నాగబంధం’ విజువల్‌గా గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: డైరెక్టర్ అభిషేక్ నామా

‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తులు, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

శతాబ్దాల నాటి ఓ రహస్యం చుట్టూ కథ సాగుతున్నట్లు ట్రైలర్ ప్రజెంట్ చేసింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భద్రపరచబడిన పవిత్రమైన బ్రహ్మ కమలం కథలో కీలక అంశంగా కనిపిస్తోంది. తరతరాలుగా రక్షించబడుతున్న బ్రహ్మ కమలంను స్వాధీనం చేసుకోవాలనే దుష్టశక్తుల ప్రయత్నాలతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.

కథ ముందుకు సాగే కొద్దీ పురాతన, ఆధ్యాత్మిక రహస్యాలు, మర్మమైన శక్తులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. భగవాన్ శివుడి ఆవిర్భావం, నాగసాధువుల ప్రవేశం కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ట్రైలర్ చివర్లో కనిపించే ‘నాగబంధం’ దివ్య రక్షణ శక్తి కథలో ప్రధాన సంఘర్షణకు కేంద్ర బిందువుగా నిలవబోతుంది.

ఈ ట్రైలర్‌లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం దర్శకుడు అభిషేక్ నామా సృష్టించిన అద్భుత ప్రపంచం. కేవలం భక్తి అంశాలకే పరిమితం కాకుండా, ట్రెజర్ హంట్, చరిత్ర, అతీంద్రియ శక్తులు, మిస్టరీ, అడ్వెంచర్ అంశాలను సమన్వయం చేస్తూ కథను మరింత ఆసక్తికరంగా మలిచారు.

నిర్మాణ విలువల పరంగా ‘నాగబంధం’ అత్యున్నత స్థాయిలో కనిపిస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ రూపొందించిన దేవాలయాలు, భారీ సెట్లు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఎస్. సౌందరరాజన్ ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత గ్రాండ్‌గా మలిచారు.

జునైద్ ఖాన్, అబే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చింది. భావోద్వేగం, ఉత్కంఠ, భక్తి భావనలను సమపాళ్లలో మేళవిస్తూ ప్రతి సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దింది. యాక్షన్ సన్నివేశాలు కూడా అత్యంత భారీ స్థాయిలో రూపొందినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ తన పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. శారీరకంగా, భావోద్వేగంగా బలమైన పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించి చిత్రానికి మరింత బలం చేకూర్చారు.

‘నాగబంధం’ ట్రైలర్ పురాణాలు, ఫాంటసీ, మిస్టరీ, అడ్వెంచర్ అంశాల అద్భుత సమ్మేళనంగా నిలిచింది. ఆసక్తికరమైన కథ, అత్యున్నత నిర్మాణ విలువలు, ఆకట్టుకునే విజువల్స్‌తో ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ:“అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక గొప్ప విజన్‌ను ఆచరణలోకి తీసుకురావాలంటే దాన్ని నమ్మే నిర్మాత అవసరం. మా నిర్మాత కిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా తెరపై కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, డీవోపీ సౌందర్ రాజన్ గారు, మా ఎడిటర్‌తో పాటు ప్రతి సాంకేతిక నిపుణుడు నా విజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. వారి సహకారం లేకుండా ఈ స్థాయి సినిమా సాధ్యమయ్యేది కాదు. జూలై 3న మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమాను అందిస్తున్నామనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం దాదాపు మొత్తం పని తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఇందులో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కూడా మన తెలుగు టెక్నీషియన్స్ రూపొందించినవే కావడం నాకు మరింత గర్వంగా ఉంది. ఈ విజన్‌ను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. విజువల్‌గా, సాంకేతికంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి.

హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. ‘నాగబంధం’ సినిమాకు మీరందరూ చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్, ఎగ్జైట్‌మెంట్ చూసి చాలా ఆనందంగా ఉంది. సినిమా అనేది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. మా దర్శకుడు అభిషేక్ గారి విజన్ ఎంత గొప్పదో ట్రైలర్‌లోనే చూశారు. ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న వ్యక్తి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో తెలుస్తుంది. మన పురాతన ఆలయాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చరిత్రను నెక్స్ట్ జనరేషన్‌కు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. అభిషేక్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నిశిత కిషోర్ గారు ఎంతో ఓర్పుతో, నమ్మకంతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే రథయాత్ర ద్వారా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ రథయాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘మా ఊరికి ఎప్పుడు వస్తుంది?’ అని చాలామంది అడుగుతున్నారు. అది ఇంకా కొనసాగుతోంది. కొత్తవాడినైనా ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి పని చేశాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఈ బాధ్యతను నా భుజాలపై పెట్టిన అభిషేక్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఎప్పుడూ నాపై ఒత్తిడి పెట్టలేదు. ఆ ఒత్తిడంతా తనే తీసుకుని, నేను కేవలం పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టేలా చేశారు. వర్క్‌షాప్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సహా ప్రతి విషయంలోనూ ఆయన నాకు అండగా నిలిచారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.”

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘నాగబంధం’ మన సనాతన ధర్మం, చారిత్రక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించిన విజువల్ స్పెక్టాకిల్. ప్రేక్షకులకు ఇది తప్పకుండా గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి ఎపిక్ కథలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అభిషేక్ నామా గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. అభిషేక్ గారి వంటి కంటెంట్‌పై నమ్మకం ఉన్న క్రియేటర్స్ మాత్రమే ఇలాంటి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలరు. నేను కూడా ఈ సినిమాను ఒక ప్రేక్షకురాలిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మేమంతా అభిషేక్ గారి విజన్‌ను నమ్మి ఈ ప్రయాణంలో భాగమయ్యాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్ గారికి, నిశిత గారికి, కిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ: నాగబంధం’తో ఒక గొప్ప సినిమాను రూపొందించాం. ఈ సినిమా కోసం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. అభిషేక్ గారు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అలాగే విరాట్ కర్ణ కూడా అసాధారణమైన డెడికేషన్‌తో పనిచేశారు. ప్రత్యేకంగా క్లైమాక్స్ చూస్తే విరాట్ ఎంత కష్టపడ్డారో మీకే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం ఆయన తన ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన తప్పకుండా చాలా పెద్ద స్టార్ అవుతారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేమందరం ఈ సినిమాకు ప్రాణం పెట్టాం. ఆ మ్యాజిక్‌ను జూలై 3న మీరు థియేటర్లలో చూస్తారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది.”

నిర్మాత నిశిత నాగిరెడ్డి మాట్లాడుతూ.. “ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ‘నాగబంధం’ మన నాగరికత వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు’ అంటారు. మేము సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చాం. సినిమాల గురించి మాకు పెద్దగా అవగాహన లేదు. అలాంటి మేము ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా విధి అనుగ్రహమే. ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్ నామా గారికి ధన్యవాదాలు. సినిమా మొత్తం ప్రయాణంలో దైవానుగ్రహం మాకు అండగా నిలిచింది. ఎన్ని సవాళ్లు వచ్చినా షూటింగ్ ఎక్కడా ఆగలేదు. కార్తీక పౌర్ణమి రోజున 24 గంటల పాటు అభిషేకం జరుగుతుండటం కూడా ఒక విశేషం. కొత్తవాళ్లం అయినా ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేయాలని అనుకున్నప్పుడు రథయాత్ర రూపంలో దేవుడే మార్గం చూపినట్లు అనిపించింది. ఈ ప్రయాణం మా అదృష్టంగా భావిస్తున్నాను.

సంగీత దర్శకులు అబి – జునైద్ మాట్లాడుతూ: ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అభిషేక్ గారికి ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది.

డీవోపీ సౌందర్ రాజన్ మాట్లాడుతూ: ఇంత గొప్ప ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఇచ్చిన అభిషేక్ గారికి ధన్యవాదాలు. ఆయన ప్రతి విభాగం నుంచి అత్యుత్తమమైన పనిని రాబట్టుకున్నారు. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మేమంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. తప్పకుండా ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Back To Top